
సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం:మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కృష్ణ నగర్ కొత్తరోడ్డులోని వీవీ గార్డెన్స్‌లో భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మాతృ దినోత్సవం సందర్బంగా భరత్ రామ్ ఫౌండేషన్ తరపున ఈ మెగా మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో వేలాది మంది పేద ప్రజలకు నిపుణులైన వైద్యులతో పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
ఈ వైద్య శిబిరానికి హైదరాబాద్‌లోని ప్రముఖ కాంటినెంటల్ హాస్పిటల్స్, రాజమండ్రికి చెందిన జీఎస్ఎల్ హాస్పిటల్స్, వాసన్ ఐ కేర్, మాగ్న, జాబిల్లి, రమాదేవి డెంటల్, ప్లస్ హాస్పిటల్స్ నుండి స్పెషలిస్ట్ వైద్యులు హాజరయ్యారు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తులు, కీళ్ల నొప్పులు, న్యూరో, గైనకాలజీ, కంటి వైద్య విభాగాల్లో రోగులకు క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించారు. రత్నం మెడికల్స్, రామలక్ష్మి మెడికల్ ఏజెన్సీ వారు ఈ కార్యక్రమానికి అవసరమైన ఔషధాలను ఉచితంగా అందించారు.
సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ తన తండ్రి మార్గాని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో రాజమండ్రి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. గతంలో మెగా జాబ్ మేళా ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా భరత్ రామ్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. రాజమండ్రి ప్రజల నుండి ఈ మెడికల్ క్యాంప్‌కు లభించిన స్పందన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తలారి వెంకటరావు, సూర్య ప్రకాష్, వాసంశెట్టి గంగాధరరావు, అద్దంకి ముక్తేశ్వరరావు, గిరజాల బాబు, స్టాలిన్ మరియు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
