
సంక్షేమమే దారి… అభివృద్ధే లక్ష్యం:మంత్రి అచ్చెన్నాయుడు
గత 23 నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. కేవలం మాటలు చెప్పడమే కాకుండా చేతల్లో రికార్డు స్థాయి విజయాలను సాధించామని పేర్కొన్నారు.
కాగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్లు అత్యంత కీలకమని ఇప్పటివరకు సుమారు రూ.63 వేల కోట్లను నేరుగా లబ్ధిదారులకు అందించామని ఈ పథకం ద్వారా లక్షలాది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల కుటుంబాల్లో వెలుగులు నిండాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఆకలితో ఎవరూ అలమటించకూడదన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల ద్వారా ఇప్పటివరకు 9.15 కోట్ల మందికి తక్కువ ధరకే నాణ్యమైన భోజనం పెట్టినట్లు ఆయన వెల్లడించారు.
చేతివృత్తుల వారికి చేయూత
ఇక వృత్తి పనుల మీద ఆధారపడే వారిని ప్రభుత్వం ఎప్పుడూ విస్మరించదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సముద్రం మీద వేటకు వెళ్లే మత్స్యకారుల కోసం రూ.250 కోట్ల ఆర్థిక సహాయం అందించామని మరోవైపు నిరంతరం కష్టపడే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం 2.90 లక్షల మందికి రూ.436 కోట్ల లబ్ధి చేకూర్చామని వివరించారు. ఈ నిధులు వారి కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు.
సొంతింటి కల.. పేదరిక నిర్మూలన
పేదలందరికీ సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందజేశామని మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణం చివరి దశలో ఉందని మంత్రి చెప్పారు. వీటితో పాటు, పీ4 మోడల్ అనే వినూత్న పద్ధతి ద్వారా 2 లక్షల కుటుంబాలను 'బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దుతూ వారిని పేదరికం నుంచి శాశ్వతంగా బయటపడేలా చేస్తున్నామని తెలిపారు. ప్రజలందరి అభ్యున్నతే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పునరుద్ఘాటించారు.
