
మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర ఎక్కడ: వైసీపీ నేత బొడ్డేడ ప్రసాద్
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం, మునగపాక మండలంలోని మునగపాక గ్రామంలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని పలు పొలాలను సందర్శించిన మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు
అనంతరం బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు కిలోకు రూ. 24 అందిస్తుంటే ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు మధ్యవర్తులకు కేవలం రూ.16 నుంచి 17 లకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. ప్రభుత్వం నేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్లే దళారులు రైతుల రక్తాన్ని పీలుస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అండగా ఉండి మెరుగైన మద్దతు ధరలు కల్పించామని కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతుల కష్టాన్ని గాలికొదిలేసిందని ఆరోపించారు.
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకునేది లేదని తక్షణమే ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని లేనిపక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కష్టపడి పండించిన పంటకు సరైన ప్రతిఫలం దక్కక రైతన్నలు పడుతున్న వేదన వర్ణనాతీతమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఆడారి గణపతి అచ్చినాయుడు, పార్టీ సీనియర్ నాయకులు ఆడారి కాశిబాబు, స్థానిక రైతులు, గ్రామ పెద్దలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
