Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలి... డీజీపీ కార్యాలయం ముట్టడించిన బీఆర్ఎస్వీ

బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలి... డీజీపీ కార్యాలయం ముట్టడించిన బీఆర్ఎస్వీ

Gaddamidi Naveen
10 మే, 2026

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆదివారం డీజీపీ కార్యాలయ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మైనర్ బాలికను లోబరుచుకుని లైంగిక దాడికి పాల్పడిన భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా, రివర్స్‌లో బాధితురాలి కుటుంబ సభ్యులనే వేధిస్తున్న పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్‌ను తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన కోరారు. బాధిత మైనర్ బాలికకు న్యాయం జరిగేలా చూడటంతో పాటు, ఆమె కుటుంబానికి పూర్తి స్థాయి భద్రత కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కేసులో నిందితుడిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు ప్రజల్లో పెరుగుతున్నాయని గెల్లు శ్రీను విమర్శించారు. బండి సంజయ్ కుమారుడికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమే అయితే, ఈ కేసులో కూడా అదే సూత్రం అమలుకావాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బండి భగీరథను అరెస్ట్ చేసి బాధితురాలికి న్యాయం చేయాలని, లేకపోతే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు.