
దేశ ప్రగతికి తెలంగాణే గ్రోత్ ఇంజన్: సీఎం రేవంత్ రెడ్డి
వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో తెలంగాణ రాష్ట్రం కీలక భాగస్వామిగా మారుతుందని, దేశ జీడీపీలో 10 శాతం వాటాను అందించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో సీఎం పాల్గొన్నారు.
దేశ ఆర్థిక వృద్ధికి మూలస్తంభాలుగా ఉన్న హైదరాబాద్ సహా ఆరు ప్రధాన మహానగరాల (ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు) అభివృద్ధికి జాతీయ ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ నగరాలకు సంబంధించిన ప్రాజెక్టులకు సత్వర అనుమతులు లభించేలా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేకంగా 'సింగిల్ విండో టాస్క్‌ఫోర్స్' ఏర్పాటు చేయాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా, దేశం అగ్రస్థానంలో నిలవాలన్నా ఈ నగరాల అభివృద్ధి అత్యవసరమని ఆయన నొక్కి చెప్పారు. హైదరాబాద్ వంటి ఆరు ప్రధాన నగరాలను గ్రోత్ ఇంజన్లుగా అభివృద్ధి చేయాలని సూచించారు.
తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం ప్రత్యేక ఫోకస్
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 'వికసిత్ భారత్'కు అనుగుణంగా రాష్ట్రంలో 'తెలంగాణ రైజింగ్ 2047' లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నట్లు సీఎం వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను ప్రధాని ముందుంచారు. రీజినల్ రింగ్ రోడ్డు పనులు వేగవంతం చేయడం. మెట్రో రైలు విస్తరణ, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, రేడియల్ రోడ్ల నిర్మాణం, హైదరాబాద్ – మచిలీపట్నం వరకు 12 వరుసల రహదారి నిర్మాణం ప్రతిపాదనలు ముఖ్యమైనవి.
నా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నేను మిమ్మల్ని, కేంద్ర మంత్రులను పలుమార్లు కలిశాను. మా ప్రతిపాదనలపై రెండు గంటల సమయం కేటాయించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరారు. అలాగే, ప్రధానికి ఉన్న 'పెద్ద మనసు'తో తెలంగాణ పెండింగ్ పనులన్నింటినీ ఆమోదిస్తారని ప్రజలు ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
