
తెలంగాణలో ఈ ఏడాది యథావిధిగా ఇంటర్ ప్రవేశాలు
తెలంగాణలో ఇంటర్ విద్యా వ్యవస్థపై కొనసాగుతున్న చర్చల మధ్య, రాష్ట్రంలో ఈ ఏడాది (2026-27) ఇంటర్మీడియట్ ప్రవేశాలను యథావిధిగా చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అడ్మిషన్లకు సమయం తక్కువగా ఉండటం, అలాగే ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియలో పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో విద్యార్థుల ప్రయోజనాలకు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు.
తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ప్రస్తుతం అమలులో ఉన్న ప్రత్యేక ఇంటర్మీడియట్ విధానాన్ని రద్దు చేసి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తరహాలో 11, 12 తరగతుల వ్యవస్థను అమలు చేయాలని సూచించింది. ఈ మార్పు వల్ల విద్యార్థుల డ్రాపౌట్ శాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని కమిషన్ అభిప్రాయపడింది.
ప్రస్తుతం దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు 11, 12 తరగతుల విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం ఇంటర్మీడియట్ విద్య వేరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల్లో చాలామంది ఆ తరువాత వేరుగా ఉన్న జూనియర్ కళాశాలల్లో చేరకుండా చదువును మధ్యలోనే నిలిపివేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ను వేరే విద్యా దశగా కాకుండా పాఠశాల విద్యలో భాగంగా కొనసాగించే అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులకు సూచనలు ఇచ్చారు. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా తన నివేదికలో ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది.
ఆందోళనలు - సీఎం సమీక్ష
ఇటీవల ఇంటర్ ప్రవేశాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. దీనిపై ముఖ్యమంత్రి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎస్ కె. రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విలీన ప్రక్రియలో అనేక సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయని, వాటిపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉందని సీఎం గుర్తించారు.
తదుపరి చర్యలు
ఈ విలీన ప్రక్రియపై భాగస్వామ్య పక్షాలతో విస్తృత సంప్రదింపులు జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ ఈ అంశంపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. కమిటీ నివేదికపై శాసనసభలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతానికి విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా తక్షణమే ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
