
కాంగ్రెస్ పాలనలో కల్లాల్లో రైతుల కన్నీళ్లు: మాజీ మంత్రి హరీష్‌రావు
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో విఫలమైందని, రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి కనికరం లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఆదివారం మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణాల్పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలతో కలిసి ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి ఎదురుచూస్తున్న రైతులతో మాట్లాడిన హరీష్ రావు, వర్షాలకు తడిసిన వడ్లను పరిశీలించి ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాల్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి 25 రోజులు గడిచినా ఇప్పటివరకు కేవలం రెండు లారీలు మాత్రమే వచ్చినట్లు రైతులు తెలిపారు. పది రోజులకు ఒక లారీ మాత్రమే వస్తే నిల్వ ఉన్న ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు వడ్లు తడవడంతో రైతులు మళ్లీ ఆరబెట్టినా కొనుగోళ్లు జరగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్లినా రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. వడ్ల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఒక్కరోజైనా కలెక్టర్ల సమావేశం నిర్వహించారా, మంత్రులతో సమీక్ష చేపట్టారా అని ప్రశ్నించారు. రైతుల సమస్యల కంటే ఢిల్లీ పర్యటనలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు ఒక్క మంత్రి కూడా ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష చేయలేదని ఆయన అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనుగోలు కేంద్రాలను ప్రత్యక్షంగా సందర్శిస్తే రైతుల అసలు కష్టాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. అధికార పార్టీకి చెందిన సర్పంచులు, నాయకులే కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ప్రభుత్వ వైఫల్యం స్పష్టమవుతోందని ఆయన చెప్పారు.
అవినీతి వల్లే ఆర్థిక సంక్షోభం
సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌లో జరిగిన అవినీతి వల్ల అది దివాలా తీసిందని, బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదని హరీష్ రావు ఆరోపించారు. అందుకే మక్కలు, శనగలు, సన్ ఫ్లవర్ అమ్మిన రైతులకు ఇప్పటివరకు నయాపైసా చెల్లించలేదని చెప్పారు. రేషన్ షాపుల్లో రూ. 500 కోట్ల విలువైన బియ్యం పురుగులు పట్టి పాడవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చేగుంట మండలంలోని పది గ్రామాల్లో వడగండ్ల వానతో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే లారీలు పంపించి, కాంటాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
