
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం నివాసాలకు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఆదివారం అత్యంత ఆత్మీయంగా సాగింది. అధికారిక పనులతో తీరిక లేకుండా గడిపే ప్రధాని, తన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లడం విశేషం. కేవలం రాజకీయాలే కాకుండా, వ్యక్తిగత అనుబంధాలకు ప్రాధాన్యతనిస్తూ సాగిన ఈ పర్యటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సీఎం నివాసంలో ఆత్మీయ ఆతిథ్యం
అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం ముగించుకున్నాక ప్రధాని మోడీ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ప్రధానికి సాదరంగా ఆహ్వానం పలికారు. కాగా ప్రధాని తమ ఇంటికి రావడం పట్ల చంద్రబాబు సంతోషం వ్యక్తం చేస్తూ.. "ప్రధాని మోడీ చూపిన ఆప్యాయత మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఇది మా కుటుంబానికి ఒక మధుర జ్ఞాపకం అని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని ఇస్తున్న మద్దతుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా
అనంతరం ప్రధాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకునేందుకు ప్రధాని వెళ్లడం గమనార్హం. దాదాపు 20 నిమిషాల పాటు పవన్ కుటుంబ సభ్యులతో గడిపిన ఆయన పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని స్వయంగా తన క్షేమ సమాచారం అడిగి తెలుసుకోవడం పట్ల పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
