Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ

ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ

Gaddamidi Naveen
10 మే, 2026

రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, కొత్త ప్రాజెక్టుల వేగవంతంపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఆదివారం హైదరాబాద్‌లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు కీలక ప్రాజెక్టుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు.

రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు, హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65) విస్తరణ పనులపై మంత్రి చర్చించారు. హైదరాబాద్–విజయవాడ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో ప్రజలు దీనిని “డెత్ రోడ్”గా అభివర్ణిస్తున్నారని పేర్కొన్న మంత్రి, ఈ మార్గాన్ని 8 లేన్లుగా విస్తరించే పనులను అత్యంత వేగంగా ప్రారంభించాలని ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌ను కోరారు.

అదే రహదారిలో ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 7.1 కిలోమీటర్ల పొడవుతో నాగ్‌పూర్ తరహాలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపినట్లు తెలిపారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి విస్తరణతో పాటు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని, అతి త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామని మంత్రికి వివరించారు.

రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు, త్వరలో చేపట్టబోయే పనులకు సంబంధించిన పలు అంశాలను కూడా మంత్రి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాల రంగం కీలకమని పేర్కొంటూ, ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే ఈ ప్రాజెక్టులు నిర్దేశిత గడువులో పూర్తి అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి కోరారు. ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఎన్‌హెచ్‌ఏఐ రీజినల్ ఆఫీసర్ శివ శంకర్ త‌దితరులు పాల్గొన్నారు.