
అప్పుల కుప్పగా ఏపీ..‘విజన్ 2047’ కాదు ఈఎంఐ 2047: ఎమ్మెల్యే టీ. చంద్రశేఖర్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీ. చంద్రశేఖర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న ‘విజన్ 2047’ కేవలం ఒక రంగుల కల అని, వాస్తవానికి అది రాష్ట్ర ప్రజల నెత్తిన భారం మోపే ‘ఈఎంఐ 2047’ అని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర బడ్జెట్ ఖర్చుల తీరుపై ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ముఖ్యంగా అప్పుల లెక్కల విషయంలో ప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం సుమారు రూ. 81,532 కోట్ల అప్పు తీసుకువస్తే అందులో కేవలం రూ. 26,864 కోట్ల విలువైన ఆస్తులు మాత్రమే కనిపిస్తున్నాయని ఆయన గణాంకాలతో వివరించారు. అంటే తెచ్చిన అప్పులో కేవలం 33 శాతం మాత్రమే శాశ్వత పనులకు వాడారని మిగతా 67 శాతం నిధులు ఎటు వెళ్లాయో తెలియడం లేదని ఆరోపించారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి సంకేతం కాదని కేవలం మాటలతో కాలక్షేపం చేసే ‘డైలాగ్‌మెంట్’ పాలన అని ఆయన ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ఆర్థిక చక్రం తిరగడం లేదని రోజువారీ అవసరాల కోసం అప్పుల మీద ఆధారపడటం ప్రమాదకరమని చంద్రశేఖర్ హెచ్చరించారు. ప్రతి నెలా కొత్త అప్పు, ప్రతి వారం వడ్డీలు చెల్లించడం, మళ్ళీ ప్రతి రోజూ కొత్త హామీలతో ప్రజలను నమ్మించడం చూస్తుంటే ఇది ‘సన్‌రైజ్ స్టేట్’ లా లేదని, ఆర్థికంగా కుప్పకూలుతున్న ‘సన్‌సెట్ ఎకానమీ’లా కనిపిస్తోందని విమర్శించారు. సగటున రోజుకు రూ. 39 కోట్ల నష్టం వస్తుంటే ప్రభుత్వం దీన్ని సరిదిద్దాల్సింది పోయి సెల్ఫ్ గోల్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని ఆయన విమర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 14,376 కోట్ల నిధులు ఆగిపోయినా అడిగే వారు లేరని, ఇది ‘డబుల్ ఇంజిన్’ కాదు ‘డబుల్ బ్రేక్‌డౌన్’ ప్రభుత్వం అని ఆయన చురకలు అంటించారు. రోడ్లు, పరిశ్రమలు, ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం చూపిస్తున్నవన్నీ ‘సినిమా ట్రైలర్ల’ లాగే ఉన్నాయని నిజానికి రాష్ట్ర ఖజానా పరిస్థితి ‘స్టార్టప్’ కాదు ‘స్టాప్‌ప్’ (ఆగిపోయే స్థితి) మోడ్‌లో ఉందని కాగ్ రిపోర్టును ఉటంకిస్తూ పేర్కొన్నారు.
అప్పులు తెచ్చి ఫ్యాక్టరీలు కడితే భవిష్యత్తు ఉంటుందని కానీ ప్రస్తుత ప్రభుత్వం అప్పులు తెచ్చి ప్రకటనలకు, వడ్డీలు కట్టడానికే వాడుతోందని చంద్రశేఖర్ ఆరోపించారు. ఇది రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టి, వర్తమానానికి మేకప్ వేయడం లాంటిదని విమర్శించారు. కాగ్ వంటి సంస్థలు లెక్కలు అడిగితే సమాధానం చెప్పలేక ప్రశ్నించే వారిపై కోపం చూపించడం పాలకుల భయానికి నిదర్శనమని ఆయన తెలిపారు.
